Wednesday, September 19, 2007

' సర్వఙ్ఞ '

ప్రతీ మనిషి వేరొకరిని ఏదో ఒక సందర్భంలో అడిగే లేదా ప్రశ్నించే వాక్యం ఇది.
"నువ్వు నన్నర్థం చేసుకోలేదు".

కానీ ఇదే ప్రశ్న మనకి మనం వేసుకొంటే? అంటే మనం మనకి అర్థం అయ్యామా?
"పూర్తిగా" అని గుండెలమీద చేయి వేసుకొని సమాధానం చెప్పగల మగధీరుడు కానీ,నారీరత్నం గానీ తారసపడతారని ఆశించడం లేదు.
ఎందుకంటే " నేను " అనేది సంక్లిష్టతల సమాహారం.
మారాం చేసే ఈ రాంగోపాల్ను అంటే ప్రస్తుతమున్న నేనుగా మార్చిన అనేక సంఘటనలు, కథలు, నీతిసూత్రాలు,మంచిమాటలు ఒకటేమిటి ఎన్నెన్నో విషయాలు మన బ్లాగు నేస్తాలతో ధారావాహికగా పంచుకోవాలనే ఆకాంక్షతో మొదలు పెడుతున్నా.మిత్రులందరూ తమ తమ అభిప్రాయాలను తెలియజేయగలరు.

ఇది నా చిన్నప్పుడు, మా నాన్నగారు చెపుతుండగా విన్న కథ. తర్వాత్తర్వాత నా మీద ఎంతో ప్రభావాన్ని చూపించిన కథ.

" సర్వఙ్ఞ "


అనగనగా ఒక రాజుగారికి తన రాజ్యంలో సర్వఙ్ఞులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలనిపించింది. సర్వఙ్ఞుడంటే అన్ని విద్యలూ పరిపూర్ణంగా తెలిసినవాడని అర్ధం. అంటే ఆ వృత్తి తన కుల వృత్తా అనిపించేంత నైపుణ్యం ఉండాలన్నమాట.
రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా!
తక్షణమే చాటింపువేసారు ఫలానారోజు పోటీ అని.
అందరూ ఎవరికివారే సర్వఙ్ఞులు.
పోటీ తీవ్రంగానే జరిగింది.
ఒక్కడు మాత్రమే అన్నింటా గెలిచి చివరిదాకా నిలబడ్డాడు.
సరే! వాడే బహుమతికర్హుడు.
బహుమతి ప్రదానం రోజొచ్చింది.
ఈయబోతూ ఈయబోతూ రాజుగారు ఆగిపోయారు.
' మళ్ళీ ఏమొచ్చిందిరా ' అనుకొంటూ సభికులు నిరుత్సాహపడ్డారు.
రాజుగారు మంత్రివైపు తిరిగి " ఏమండీ! మీరే కద కమిటీ అధ్యక్షులు. పరీక్ష సక్రమంగానే జరిగిందా మంత్రిగారూ? " అంటూ ప్రశ్నించారు.
" ఆర్యా! అన్ని విద్యల్లోనూ ఇతగాడు ప్రవీణుడే సుమండి!" అంటూ మంత్రిగారు ముక్తాయించారు.
"అయినా కాని నాదో చిన్న పరీక్ష" అంటూ విజేతవైపు చూచి
" ఏమయ్యా! నీకు చెప్పులు కుట్టడం వచ్చా?" అంటూ ప్రశ్నించారు.
సభికులంతా విస్తుపొయారు. ఒక సద్బ్రాహ్మణునిచే చండాల పని చేయించడమా? అప్రయత్నంగానే అందరి చూపుడువేళ్ళూ ముక్కులపైకి పోయాయి.
అతగాడు మాత్రం తడబడలేదు.
" చిత్తం మహారాజా!" అంటూ తనకు కావాల్సిన తోళ్ళూ,దారం,కత్తీ వగైరాలు తెప్పించికొని పని మొదలు పెట్టాడు.
రాజుగారు మాత్రం తదేకదృష్టితో అతడినే పరిశీలించసాగారు.
కొలతలు తీసుకున్నాడు.తోలు కత్తిరించుకున్నాడు.కుట్టడం పూర్తి కావొచ్చింది. చివరికి కంట్రాణీతో దారం బయటికి లాగి పూర్తిగా వచ్చిందొ లెదో తెలుసుకోవడం కోసమని ఆ దారం కొసని పళ్ళ మధ్య పట్టి గట్టిగా లాగాడు.
"శహభాష్. నువ్వే సర్వఙ్ఞుడివి" అంటూ కౌగలించుకొని బహుమతి ప్రదానం చేసాడు.
ఆ విధంగా దారాన్ని పళ్ళతో పట్టి లాగడం అనేది చెప్పులు కుట్టడం వృత్తిగాగల మాదిగవారు మాత్రమే చేయగల నిపుణత.

***************
కథ అయిపోయింది. కానీ నాలో ఆలోచన ప్రారంభం అయింది. అన్ని పనులూ ఏ ఒక్కరైనా అలా పరిపూర్ణమైన ప్రావీణ్యతతో చేయగలరా? అని.
సరే! ప్రయత్నిస్తే వచ్చే నష్టం ఏమి లేదు కదా అని ఆచరణలో పెట్టి చాలావరకు సాధించగలిగాను. అన్నిపనుల్లో కాకపోయినా, చేసిన పనిలో మాత్రం పరిపూర్ణత తీసుకురావడంలో మాత్రం చాలవరకు కృతకృత్యుణ్ణి కాగలిగాననడం సత్యదూరం కాదు.
"Even if a best thing is given to you, you should make it better" అనేది తర్వాతి కాలంలో నాకొక మంత్రం అయికూర్చుంది.
మీరూ ప్రయత్నించండి నేస్తాలూ.ఫలితం తప్పక కనిపిస్తుంది.

Tuesday, September 18, 2007

ఆర్భాటం

నా ప్రియ మిత్రులారా,

ఇది నా తొలి బ్లాగు. వాస్తవ ప్రపంచంలో వెలువరించలేని ఎన్నో ఆలోచనలను,అనుభవాలను,ఆవేశాలను,అనురాగాలను, అసహ్యాలను, ఒకటేమిటి అన్నింటినీ బయటకి వెళ్ళగ్రక్కి సేదదీర్చుకొనే మార్గమిదేనని ఎన్నాళ్ళుగానో వింటున్నప్పటికీ సమయాభావం వలన కొంత, దాని లోతు,దరి తెలియక కొంత ఇన్నాళ్ళూ దూరంగా ఉన్నాను.

BETTER LATE THAN NEVER!

ఇక ఆలస్యంగానైనా, ఆర్భాటంగా ప్రవేశిస్తున్నాను.
ఓంప్రధమంగా గణనాధుని స్తుతి:
ఏకదంతాయ విద్మహే.
వక్రతుణ్డాయ ధీమహి ..
తన్నో దంతిః ప్రచోదయాత్

వాణీస్తుతి:

బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ.
సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమః
మాతృ దీవెన :

వాగ్దేవి వక్షద్వయమన్న గడుప్రీతి నీకు గుమారా
గ్రోలుమీ సంగీత సాహిత్య క్షీరధారల గడుపార
భవదంఘ్రి యుగళమంటి గైకొనుమాశీస్సులు
రచనల్ సేయంగల ప్రౌఢిమగల్గు!జయమయ్యెడిన్!

ఇక ఇప్పటికే బ్లాగుప్రపంచంలో వీర విహారం చేస్తున్న బ్లాగు వీరులందరికీ ఇవే నా నమోవాకములు.
మీ ఆశీస్సులూ,సూచనలనాశిస్తూ,
మా'రాం'గోపాల్

P.S:
1) ఇది చదివినవారు కనీసం రెందు ముక్కల్లోనైన ఆశీస్సులనందించవలసిందిగా ప్రార్ధన.
తప్పితే 'దడిగా డువా నవిదిచ '.
2) దూకుడిని మన్నించగలరు.చిలిపి చేష్టలేకాని,పిచ్చిచేష్టలు కావని గమనించగలరు.
3)పాతోళ్ళైనా,కొత్తోళ్ళైనా నాతో లింకు పెట్టుకోగలరు.

చివర్లో గిలిగింత: 'రవిక'లో ఉండే ఆ రెండూ ఏవో చెప్పగలరా?